
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి నాయకత్వంపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి విధానాన్ని అనుసరించినా కూటమి అభ్యర్థులకే ప్రజల మద్దతు లభిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలు, పోస్టల్ బ్యాలెట్లు.. ఏ పద్ధతిలో ఎన్నికలు జరిగినా కూటమి ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలను పార్టీ నాయకులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. కేవలం రాష్ట్రస్థాయి, నియోజకవర్గ స్థాయి రాజకీయాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
క్షేత్రస్థాయిలో కొత్త నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించేందుకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కూటమి తరఫున బలపరిచిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలోనూ కూటమి బలాన్ని నిరూపించుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్