
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, దర్శన క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కార్తికమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వ్రతమండపం వద్ద భక్తుల రాకతో రద్దీ నెలకొంది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తికమాసంలో వ్రతాలు నిర్వహిస్తే శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శన క్యూలైన్ల నిర్వహణతో పాటు వ్రతమండపం వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలతో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్