దుండిగల్లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ప్రైవేట్ బస్సులు దగ్ధం
మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేట సమీపంలోని ఓ గ్యారేజ్లో పార్క్ చేసిన ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
Image of the Fire Destroying Commercial Establishments in Silapathar During Diwali Celebrations.


హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేట సమీపంలోని ఓ గ్యారేజ్లో పార్క్ చేసిన ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం గ్యారేజ్ సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. తొలుత ఒక బస్సుకు అంటుకున్న మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వేగంగా వ్యాపించాయి. దీంతో కొద్దిసేపటికే ఐదు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బస్సులకు భారీగా నష్టం వాటిల్లింది.

ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు విచారణ చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande