
అన్నమయ్య , 15 నవంబర్ (హి.స.)అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మదనపల్లెకు చెందిన స్థిరాస్తి వ్యాపారి సాదిక్‌ను కొందరు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ నమ్మించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆయనను విడిచిపెట్టేందుకు బాధితుడి నుంచి ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. కిడ్నాప్ చేసిన వ్యాపారిని విడిచిపెట్టేందుకు డబ్బులు తీసుకునే క్రమంలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కిడ్నాప్‌కు ఉపయోగించిన కారుతో పాటు నకిలీ తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నకిలీ అధికారుల అవతారంలో కిడ్నాప్‌కు పాల్పడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్