
నెల్లూరు , 15 నవంబర్ (హి.స.)
నెల్లూరు జిల్లాలో విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ఈ క్రమంలో నెల్లూరులో నిర్మాణంలో ఉన్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ భవన పనులను ఆయన పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుంచి రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్, ప్లేగ్రౌండ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మరోవైపు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన రూ.550 కోట్ల పథకం పనులు తుది దశకు చేరుకుంటున్నాయని నారాయణ వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికీ మినరల్ వాటర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విద్య, తాగునీటి రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్