
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతును తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
కాగా, నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లిలో నిన్న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్ను ఓ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతుతో పాటు ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న మంత్రి పొంగులేటి ఫోన్ ద్వారా స్పందించి అధికారిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజీవ్ హనుమంతు త్వరగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్