కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత.. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను మంత్రి సవిత దర్శించుకున్నారు.
MINISTER SAVITHA


విజయవాడ, 15 నవంబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను మంత్రి సవిత దర్శించుకున్నారు. తనయుడితో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవస్థాన పాలకమండలి సభ్యులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

దర్శనం అనంతరం మంత్రి సవిత ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, క్యూ లైన్ల నిర్వహణ, ఇతర సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande