
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేడు రెండో రోజుకు చేరుకుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
తొలిరోజు మొత్తం 274 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో మేయర్, చైర్పర్సన్ పదవులకు సంబంధించి 16 నామినేషన్లు రాగా, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 258 నామినేషన్లు అందాయి. రెండో రోజు మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నామినేషన్ల సమర్పణకు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. దీంతో చివరి రోజున అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. టికెట్లు ఆశిస్తున్న నాయకులు పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసేలోగా రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్