
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ వ్యాన్ అదుపుతప్పి సుమారు 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ నాయుడు ప్రాణాలు కోల్పోయారు.
డైమండ్ పార్క్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘాట్‌రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వ్యాన్ అదుపు తప్పడంతో రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ క్యాబిన్ దెబ్బతినడంతో డ్రైవర్ నాయుడు అందులోనే చిక్కుకుపోయారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే డ్రైవర్‌ను రక్షించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరగడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్