
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,967 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 404 పంచాయతీలు ఉండగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 66 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
తొలి విడతలో భాగంగా ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 3,967 సర్పంచ్ స్థానాలతో పాటు 40,012 వార్డు సభ్యుల స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్