
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని శివరాంపల్లి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న రైడర్‌తో పాటు ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయం చేశారు. అనంతరం పోలీసులకు, అత్యవసర వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. గాయాల తీవ్రత దృష్ట్యా ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం రాపిడోకు చెందినదిగా ప్రాథమిక సమాచారం వెల్లడవుతోంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది? బైక్ వేగంగా ప్రయాణించడమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. నగరంలో రద్దీగా ఉండే రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్