జీలుగుమిల్లిలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జీలుగుమిల్లి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.
नामेरी टाइगर रिजर्व। NAMERI TIGER RESERVE


అమరావతి , 15 నవంబర్ (హి.స.)

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జీలుగుమిల్లి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున జీలుగుమిల్లి నుంచి పాలచర్ల వెళ్లే మార్గంలో పెద్దపులి రోడ్డుపైకి వచ్చినట్లు గుర్తించారు.

అదే సమయంలో అటుగా ఓ కారు రావడంతో దాని హెడ్లైట్ల వెలుతురు పులిపై పడింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పెద్దపులి రోడ్డుపై నుంచి పక్కకు వెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

పెద్దపులి సంచారం విషయం తెలియడంతో జీలుగుమిల్లి పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వ్యవసాయ పనులు, ఇతర అవసరాల కోసం పొలాలకు వెళ్లే వారు సైతం భయపడుతున్నారు. పులి ఎక్కడ సంచరిస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులు పులి కదలికలపై నిఘా ఉంచి ప్రజలకు తగిన సూచనలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande