తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Ttd


తిరుమల , 15 నవంబర్ (హి.స.)

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.

ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. భక్తుల క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరుకోవడంతో తిరుమలలో రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉంటూ స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలను అందిస్తున్నారు. మరోవైపు శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి వచ్చే వారు తగిన సమయం కేటాయించుకుని తిరుమల యాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande