వరాహ నదిలో విషాదం.. స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
Water


అనకాపల్లి , 15 నవంబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఎస్.రాయవరం మండలం పెనుగల్లు సమీపంలోని వరాహ నదిలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆరుగురు యువకులు నిన్న వరాహ నదికి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో వారంతా నదిలోకి దిగగా, ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు ఎలాగోలా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.

మృతులను కాతేటి రిషి (18), ముప్పిడి వంశీ (20), కోడి గణేశ్ (20)గా పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న వయసులోనే యువకులు మృత్యువాత పడటంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande