
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బొమ్రాస్పేట మండలం నాందార్పూర్ సమీపంలో కారు, ఆటో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన కారు, ఆటో ఢీకొనడంతో వాహనాల్లో ఉన్నవారు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఆటో, కారు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు, కారులో ఉన్న మరొకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో నాందార్పూర్ పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగం కారణమా? లేక డ్రైవర్ల నిర్లక్ష్యమా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్