
భీమవరం , 16 నవంబర్ (హి.స.)
భీమవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటన విషయంలో మిత్రపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ పాకా సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమవరం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి తగిన గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మిత్రపక్షాలు అనుసరిస్తున్న వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య పరస్పర సమన్వయం, గౌరవం ఉండాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మిత్రధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
అవసరమైతే భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని పాకా సత్యనారాయణ వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మిత్రపక్షాల మధ్య నెలకొన్న ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందు కూటమి పార్టీల మధ్య ఈ విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్