పిల్లల సమస్యలను పరిష్కరించడం పై అధికారులు దృష్టి పెట్టాలి.... కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం బాలల ప్రత్యేక ప్రజావాణి జరిగింది.
Collector


రాజన్న సిరిసిల్ల, 16 నవంబర్ (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం బాలల ప్రత్యేక ప్రజావాణి జరిగింది. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సాధారణ ప్రజావాణితో పాటు దీనిని నిర్వహించారు.

పిల్లల హక్కులను కాపాడటం, వారి సమస్యలను పరిష్కరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బోర్డుపై చిల్డ్రన్ యూ ఆర్ ద ఫ్యూచర్.. ఫ్లై హై వీ ఆర్ విత్ యూ అనే సందేశాన్ని రాసి కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన పిల్లల నుంచి అర్జీలు తీసుకున్నారు.

దివ్యాంగుల పెన్షన్, అదనపు తరగతి గదులు, పాఠశాలల్లో వసతులు, ఇందిరమ్మ ఇళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలనే అంశాలపై దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడంతో పాటు వారి హక్కులను కాపాడి, సమస్యలకు పరిష్కారం చూపడమే బాలల ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande