
కరీంనగర్, 16 నవంబర్ (హి.స.)
సైదాపూర్‌లో జరిగిన ప్రత్యేక సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సమాజంలో పట్టించుకోకుండా వదిలేస్తున్న దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేసే అవకాశం రావడాన్ని తన పూర్వజన్మ పుణ్యంగా, అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
అర్హులైన ప్రతి దివ్యాంగుడికి, వృద్ధుడికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని, వారికి కావాల్సిన సౌకర్యాలు, ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరాన్ని బట్టి ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, ఊతకర్రలు, వీల్ఛైర్లు, ట్రైసైకిళ్లు, మూడు చక్రాల మోటారు వాహనాలు ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అలిమ్కో సహకారంతో నియోజకవర్గంలో అర్హులందరికీ ఈ పరికరాలను పూర్తిగా ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
సమాజంలో ఎవరూ నిరాదరణకు, వివక్షకు గురికాకూడదనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దివ్యాంగుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలో అర్హులకు కొత్తగా 5 వేల ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని శుభవార్త చెప్పారు.
గతంలో సాంకేతిక కారణాలతోనో, మరే కారణంతోనో పెన్షన్ రాక ఇబ్బంది పడిన వారు నిరాశ పడాల్సిన అవసరం లేదని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులందరికీ తప్పకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..