మహబూబ్నగర్ జిల్లాలో ఏసీబీ సోదాలు.. నాలుగు బృందాలతో తనిఖీలు
మహబూబ్నగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Acb


మహబూబ్నగర్ జిల్లా , 16 నవంబర్ (హి.స.)

మహబూబ్నగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో) వాణికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గత నెల 30న వాణిని ఏసీబీ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాణి సంపాదించిన ఆస్తులు, వాటి కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె స్వగ్రామమైన రాజునాయక్తండాలో మూడు ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అక్కడ ఆమెకు సంబంధించిన ఇళ్లు, ఇతర ఆస్తుల వివరాలను పరిశీలించినట్లు సమాచారం.

మరోవైపు మహబూబ్నగర్లోని టీడీ గుట్ట రోడ్డులో ఉన్న ఓ వైన్స్ దుకాణంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాణికి ఈ దుకాణంతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, లభించిన పత్రాల ఆధారంగా తదుపరి విచారణ కొనసాగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాణి ఆస్తుల విలువ, ఆదాయానికి మించిన సంపాదన ఉందా అనే అంశాలపై దర్యాప్తు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande