
అమరావతి , 16 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించే అవకాశముంది.
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకునేలా సీఎం ప్రయత్నించనున్నారు. ఢిల్లీలో తన పర్యటన ముగించుకున్న అనంతరం రేపు రాత్రి చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో జరిగే సమావేశాలపై రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్