
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)
పోలీస్ బ్యాండ్ అనేది బలగాల క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన పోలీస్ బ్యాండ్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ విభాగాలకు చెందిన 21 పోలీస్ బ్యాండ్ బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ బ్యాండ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలో పోలీస్, మార్షల్ బ్యాండ్ సంప్రదాయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అనంతరం పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యంపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఇది ఎంతో శుభపరిణామమని కొనియాడారు. అలాగే సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీస్ శాఖల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. దేశ భద్రత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో వివిధ భద్రతా దళాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం ఎంతో కీలకమని డీజీపీ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు