IVF అక్రమాల కేసులో నిందితులు చంచల్గూడ జైలుకు తరలింపు
IVF కేంద్రాల్లో అక్రమాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
Arrest


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)

IVF కేంద్రాల్లో అక్రమాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురు IVF సెంటర్ల నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొందరు నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

విచారణలో ఎగ్ సేకరణకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళల నుంచి అండాలను సేకరించే సమయంలో బ్లడ్ గ్రూప్, మతం, చర్మం రంగు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సేకరించిన ఎగ్స్ నాణ్యతగా లేవని భావిస్తే అబార్షన్లు చేయించినట్లు కూడా తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలు కేసు తీవ్రతను మరింత పెంచుతున్నాయి.

ఈ అక్రమాల వెనుక మొత్తం ఏడు IVF కేంద్రాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయా కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయితే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande