
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లో తాగునీటి సరఫరా అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. హైదరాబాద్లో అసలు తాగునీటి సమస్యే లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. మంత్రి ఉత్తమ్ మాటలను ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో తాను విన్న అత్యుత్తమ జోక్ ఇదేనని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేవని చెప్పారు. వచ్చే వానాకాలం వరకు రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాగునీటి కొరతపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని, అవన్నీ అసత్య ప్రచారాలేనని ఉత్తమ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు