
మహబూబ్నగర్ జిల్లా, 16 నవంబర్ (హి.స.)
మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కురుమూర్తి స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉద్దాల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఆలయ అధికారులు, ఉత్సవ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఉద్దాల మహోత్సవాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత, క్యూలైన్లు, తాగునీరు తదితర సౌకర్యాలపై దృష్టి సారించారు.
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్