నేడు సీడబ్ల్యూసీ అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు అనుమతుల సాధనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
UTTAM KUMAR


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు అనుమతుల సాధనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులను కలవనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ఇతర కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు.

సమ్మక్క సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రాజెక్టు ప్రతిపాదనలు, సాంకేతిక అంశాలు, నీటి కేటాయింపులకు సంబంధించిన విషయాలను కేంద్ర అధికారుల దృష్టికి మంత్రి తీసుకెళ్లనున్నారు. అనుమతుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపనున్నారు.

ఇదిలా ఉండగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ముడిపడిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వరుసగా కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి సమావేశాలు నిర్వహిస్తుండటంతో ప్రాజెక్టు అనుమతుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande