
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)
వృద్ధులు, మానసిక దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలనెలా ఆర్థిక ఆసరాగా నిలిచేదే పెన్షన్ పథకమని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సోమవారం బేగంపేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన, కొత్తగా మంజూరైన పెన్షన్ పత్రాలను పలువురు మానసిక దివ్యాంగులు, వితంతు లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని, తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకే ప్రతి నెలా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో పెన్షన్‌కు అర్హత ఉన్నవారిని కూడా అనర్హులుగా చూపుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, దరఖాస్తుదారుల ఇళ్లకు విచారణకు వెళ్లిన సిబ్బంది, వారి దగ్గర కారు ఉందనే కారణంతోనే అనర్హులని తేలుస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విధానంపై అధికారులు, ప్రభుత్వం మళ్లీ ఆలోచించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. మానసిక దివ్యాంగులకు ఇస్తున్న రూ.4 వేల పెన్షన్‌ను రూ.6 వేలకు, వితంతు, వృద్ధుల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పారని అన్నారు. మూడేళ్లు గడవబోతున్నా ఇప్పటివరకు ఆ మొత్తాన్ని పెంచలేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం మానసిక దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మాత్రమే కొత్త పెన్షన్లు ఇచ్చిందని, మరి వృద్ధులకు ఎప్పుడు ఇస్తారని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..