
నారాయణపేట, 16 నవంబర్ (హి.స.)
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీహరి పిలుపునిచ్చారు.
క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అన్నారు. సోమవారం మక్తల్లో మినిస్టర్ కప్ 2026-27 సీజన్-1 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ పోటీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. మక్తల్లో రూ.25 కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు వెల్లడించారు. క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించిందని, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలు, స్టేడియాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన చికిత రావు వంటి క్రీడాకారులు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు.
క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఇందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు