
నాగర్ కర్నూల్, 16 నవంబర్ (హి.స.)
నాగర్‌కర్నూల్‌లో సోమవారం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ ను కలుసుకున్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిసి తమ సమస్యను వినతి పత్రం రూపంలో విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ పెన్షన్ వర్తింపజేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టుల బాగోగుల కోసం తెలుగు ప్రభ పత్రిక ముందుకు తెచ్చిన పెన్ను.. పన్ను.. పెన్షన్ అనే కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సంఘాలతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పోరాడితేనే డిమాండ్ నెరవేరుతుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని గుర్తుచేసిన వారు, అయినా వారి సంక్షేమం విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యం చేయకుండా ఇప్పుడైనా సానుకూల నిర్ణయం తీసుకుని జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు