రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Election commission


అమరావతి , 16 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామాల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీలు చేసుకోవచ్చు. 23న అప్పీళ్లను పరిష్కరిస్తారు.

నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 30న రీపోలింగ్ చేపట్టనున్నారు. కాగా, రెండో విడత షెడ్యూల్లో విశాఖపట్నం జిల్లాకు చోటు కల్పించలేదు. మూడో విడతలో ఆ జిల్లాలోని నాలుగు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande