
హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకి 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు జేఎన్టీయూలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో యూనివర్సిటీ ప్రాంగణంలో విషాదఛాయలు అలముకున్నాయి. తోటి విద్యార్థులు ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బందిని ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్