
న్యూఢిల్లీ, నవంబర్ 26 (హి,స) దేశవ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రారంభించిన 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' (బాల్య వివాహ రహిత భారత్) ప్రచారం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం (నవంబర్ 27) జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు వివిధ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొంటారు.
ప్రభుత్వం, సమాజంలోని అన్ని వర్గాల సమిష్టి భాగస్వామ్యంతో బాల్య వివాహాలను అరికట్టాలనే లక్ష్యంతో నవంబర్ 27, 2024న ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన పెంచడం, సమాజాన్ని చైతన్యపరచడం, నివారణ యంత్రాంగాలను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ జాతీయ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, బాల్య వివాహ నిషేధ అధికారులు, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు, జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా - NALSA), పౌర సమాజ సంస్థలు పాల్గొంటాయి.
ఈ ప్రచారం కింద ఇప్పటివరకు సాధించిన పురోగతిని సదస్సులో సమీక్షించనున్నారు. బాల్య వివాహాల నివారణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టిన వినూత్న కార్యక్రమాలను ప్రదర్శించడంతో పాటు, క్షేత్రస్థాయిలో కృషి చేసిన అధికారులు, భాగస్వాముల సేవలను గుర్తించి అభినందిస్తారు. ఈ దురాచారాన్ని పూర్తిగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చలు జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీర్మానం ప్రకారం నవంబర్ 27న 'బాల్య, ముందస్తు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం' నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు నిర్వహించారు. బాల్య వివాహ నిషేధ అధికారుల పాత్రను మరింత బలోపేతం చేయడం, ఘటనలను సకాలంలో నివేదించడం, బాలికల విద్య, సాధికారత, సంక్షేమాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
రెండో వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, క్షేత్రస్థాయి సిబ్బంది, యువత, సామాజిక, మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ ప్రజలు ఇందులో భాగస్వాములు కానున్నారు. ప్రత్యేక గ్రామ సభలు, అవగాహన ప్రచారాలు, ప్రతిజ్ఞలతో పాటు డిజిటల్ వేదికల ద్వారా పౌరులను నిమగ్నం చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు.
'బాల్ వివాహ్ ముక్త్ భారత్' పోర్టల్ ద్వారా పౌరులు బాల్య వివాహ ఘటనలపై ఫిర్యాదు చేయడంతో పాటు, సంబంధిత నిషేధ అధికారుల వివరాలను తెలుసుకోవచ్చు. అవగాహన కార్యక్రమాల వివరాలను నమోదు చేయడానికి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడానికి కూడా ఈ పోర్టల్ వీలు కల్పిస్తుంది.
బాల్ వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్, మైగౌ (MyGov), మై భారత్ (MY Bharat) వేదికల ద్వారా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని మంత్రిత్వ శాఖ పౌరులు, సంస్థలకు పిలుపునిచ్చింది. ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన, విద్యావంతమైన, సాధికారిక బాల్యాన్ని అందించేందుకు దేశం కట్టుబడి ఉందని ఈ జాతీయ కార్యక్రమం మరోసారి స్పష్టం చేస్తోంది.
---
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi