తిరుపరంకుండ్రం దీపం వివాదంలో కీలక మలుపు.. సిఎస్, డిజిపిలకు కోర్టుదిక్కర నోటీసులు
తిరుపరంకుండ్రం దీపం వివాదంలో కీలక మలుపు.. సిఎస్, డిజిపిలకు కోర్టుదిక్కర నోటీసులు
Supreme court


న్యూఢిల్లీ, 27 నవంబర్ (హి.స.)

మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీపతూన్ వద్ద నవంబర్ 28న కార్తీక దీపం వెలిగించాలని ఆదేశించడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పండుగ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 28న దీపం వెలిగించేలా చూడాలని ఆలయ ట్రస్ట్ కు కొత్తగా నియమించిన రిసీవర్లను ధర్మాసనం ఆదేశించింది. నవంబర్ 20న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపం వెలిగించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఆదేశాలను అమలు చేయలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది.

గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహా మొత్తం 15 మందికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. వీరిలో హిందూ మత, ధార్మిక దానాల శాఖ కార్యదర్శి, కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎస్పీ, ఆలయ అధికారులు కూడా ఉన్నారు. వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం కోరింది. మూడు రోజుల్లోగా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా నోటీసులు అందించాలని, అవి అందినట్లు ధ్రువీకరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఆలయ ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులు వైద్యనాథన్, పార్థిబన్ లను రిసీవర్లుగా నియమించింది. దీంతో ఆలయ నిర్వహణపై వారి పర్యవేక్షణ కొనసాగనుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande