
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.) రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు సహా కేంద్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందని విమర్శించారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నేతలు తెలిపారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్