
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనతోనే కాంగ్రెస్ లో భయం మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఓడించి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని పాయల్ శంకర్ ఆరోపించారు. కామారెడ్డిలో ఎదురైన ఓటమిని సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుందని గుర్తుచేశారు.
రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..