ఇంటికి దీపం వెలుగునిచ్చినట్టే.. హిందూ సమాజానికి విశ్వహిందూ పరిషత్ వెలుగునిస్తుంది
ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి నిలబడ్డ ఏకైక చైతన్య వేదిక విశ్వహిందూ పరిషత్ అని అంబత్రయ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశర స్వామి అన్నారు.
ఇంటికి దీపం వెలుగునిచ్చినట్టే.. హిందూ సమాజానికి విశ్వహిందూ పరిషత్ వెలుగునిస్తుంది


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)

ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి నిలబడ్డ ఏకైక చైతన్య వేదిక విశ్వహిందూ పరిషత్ అని అంబత్రయ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశర స్వామి అన్నారు. వేదాలలో పేర్కొన్న ధర్మాన్ని సాక్షాత్కరించడానికి పూనుకున్న గొప్ప సంస్థ విశ్వహిందూ పరిషత్ అని కొనియాడారు. ఋషులు, మునులు పేర్కొన్న విధంగా ధర్మాన్ని సజీవంగా నిలబెట్టేందుకు ఆవిర్భవించిన సంస్థ విశ్వహిందూ పరిషత్ అని పేర్కొన్నారు. సనాతన ధర్మ బంధువులందరూ విశ్వహిందూ పరిషత్లో చేరి ధర్మకార్యంలో భాగస్వాములు కావాలని పరాశర స్వామి పిలుపునిచ్చారు.

ఈ నెల 26వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని బిజ్వార్ గ్రామంలో గల అంబత్రయ క్షేత్రంలో ఆదిత్య పరాశర స్వామికి విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి సభ్యత్వం అందజేశారు.

విశ్వహిందూ పరిషత్ లో సభ్యత్వం తీసుకోవడం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఆదిత్య పరాశర స్వామి హర్షం వ్యక్తం వ్యక్తం చేసి మాట్లాడారు.ఇంటికి దీపం వెలుగునిచ్చినట్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ విశ్వహిందూ పరిషత్ వెలుగును అందిస్తోందని అన్నారు. ఆ వెలుగుల ప్రకాశంలో మనమందరం ఉన్నతంగా జీవించాలని సూచించారు. పెద్దలు మనకు అందించిన మహావృక్షం వంటి విశ్వహిందూ పరిషత్ను మనమందరం ఆశ్రయించి ధర్మాన్ని ఆచరించాలని, అనుసరించాలని ఉద్ఘాటించారు.

ప్రస్తుతం హిందూ సమాజమంతా విశ్వహిందూ పరిషత్ను ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైందని ఆదిత్య పరాశర స్వామి అన్నారు. విశ్వహిందూ పరిషత్ పెద్దలు సభ్యత్వ పుస్తకాలతో ప్రతి ఒక్కరినీ కలుస్తున్నందున మనమందరం తప్పనిసరిగా ఆ సంస్థలో సభ్యత్వం స్వీకరించాలని కోరారు. విశ్వహిందూ పరిషత్ మన హిందువులందరి సంస్థ అని, దానిని మనమందరం కాపాడుకోవడంతోపాటు ధర్మాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

ఎన్నో ఆదర్శాలు, ఆశయాలతో కూడుకున్న సంస్థ విశ్వహిందూ పరిషత్ అని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, గోరక్షణ, దేవాలయాల పరిరక్షణ, వేదాల సంరక్షణతోపాటు జాతీయ భావాల పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమిస్తున్న విశ్వహిందూ పరిషత్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేరాలని పిలుపునిచ్చారు. కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా విశ్వహిందూ పరిషత్లో చేరి హిందూ సమాజ ఐక్యతకు కృషి చేయాలని కోరారు.

విశ్వహిందూ పరిషత్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రముఖులతో కలిసి ధర్మకార్యంలో భాగస్వామిని అయ్యేందుకు రేణువంత అవకాశం తనకు కూడా విశ్వహిందూ పరిషత్ కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని స్వామీజీ అన్నారు. ధర్మరక్షణ కోసం నిరంతరం తపిస్తూ, తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ విశ్వహిందూ పరిషత్ సభ్యత్వాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. హిందువులందరికీ 'మేమున్నాం' అంటూ వెన్నెముకగా నిలబడుతున్న విశ్వహిందూ పరిషత్, హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ధర్మకార్యంలో ముందుకు సాగుతోందని అన్నారు.

విశ్వహిందూ పరిషత్ను ఆదరిద్దామని, సభ్యత్వం స్వీకరించి ధర్మకార్యంలో భాగస్వాములమవుదామని అంబత్రయ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశర స్వామి హిందూ సమాజానికి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, నాయకులు బొక్కి సాయిలు, ఎంగలి సిద్దు, గవినోల్ల శేఖర్, చుక్క రాజు, చర్లపల్లి ఆంజనేయులు, కమ్మరి మహేష్, చుక్క గోవిందు, దుబాయ్ రమేష్, ఎదురింటి కనకప్ప, బీడీల రాము తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande