విద్యార్థులకు డిజిటల్ విద్యతో పాటు పౌష్టికాహారం.. మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
Minister


హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించిన గ్రామంలో ఆయన కీర్తికి నివాళిగా రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పాఠశాలకు శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో ఈ పాఠశాలలో హాస్టళ్లు, డైనింగ్ హాల్, క్రీడా మైదానం, డిజిటల్ విద్యతో పాటు పౌష్టికాహారం వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ విద్యను కూడా అనుసంధానించి 12వ తరగతి వరకు ఒకే చోట విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మెగా డీఎస్సీ ద్వారా 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande