నెక్లెస్రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకున్న సంవిధాన్ రక్షా మార్చ్
రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చాటిచెప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించారు.
నెక్లెస్రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకున్న సంవిధాన్ రక్షా మార్చ్


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చాటిచెప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీసీసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మార్చ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో భాగస్వాములయ్యారు. రాజ్యాంగ విలువలను కాపాడాలనే నినాదంతో నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం తమ బాధ్యత అని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ర్యాలీ నగరంలోని నెక్లెస్రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంది. అక్కడ నాయకులు నివాళులర్పించి రాజ్యాంగ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande