
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.
భూ వివాదంలో పిటిషనర్‌కు తగిన పోలీసు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డికి రెండు వారాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి కూడా శిక్ష, జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే తీర్పు అమలుపై హైకోర్టు వారం రోజులపాటు సస్పెన్షన్ విధించింది. ఈ గడువులోగా సంబంధిత ఉత్తర్వులు పొందకపోతే అధికారులు కోర్టు ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పోలీసు ఉన్నతాధికారులపై హైకోర్టు తీసుకున్న ఈ చర్య పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్