మూసాపేట్ ట్రక్ పార్క్ భూముల వేలంపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్లోని మూసాపేట్ ట్రక్ పార్క్ భూముల వేలం అంశం హైకోర్టుకు చేరింది.
Court


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని మూసాపేట్ ట్రక్ పార్క్ భూముల వేలం అంశం హైకోర్టుకు చేరింది. ఈ భూములను వేలం వేయకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 27న ట్రక్ పార్క్ భూములను వేలం వేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. 1982 నుంచి ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ భూములను సేకరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని వేలం వేయడం వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు ప్రభుత్వ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) వాదనలు వినిపించారు. భారీ వాహనాల పార్కింగ్కు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిసరాల్లో తగినంత స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. భూముల వేలం ద్వారా సమకూరే ఆదాయాన్ని నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తామని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. దీంతో భూముల వేలంపై న్యాయస్థానం వెలువరించే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande