
నల్గొండ, 26 నవంబర్ (హి.స.)
పల్నాడు ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును అడ్డుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, అందుకే నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైందనేది ముఖ్యం కాదని, దానిని నిలువరించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే పనులు ముందుకు సాగాయని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు విమర్శలు మాని, అందరూ కలిసికట్టుగా ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరారు. కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని అన్నారు.
నల్గొండ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపిన మంత్రి, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు