బీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో గురువారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన బీఆర్ఎస్ మండల నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా దాడి చేశారు.
Crime crime


నాగర్ కర్నూల్, 26 నవంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో గురువారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన బీఆర్ఎస్ మండల నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా దాడి చేశారు.

తీగలపల్లికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకుడు భాస్కర్ రెడ్డి (54) రోజూ మాదిరిగానే గురువారం ఉదయం వాకింగ్ కు బయలుదేరారు. బావాయిపల్లి వైపు నడుచుకుంటూ వెళుతుండగా చీకట్లోనే మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై పడ్డారు. ముందుగా కళ్లల్లో కారం చల్లి, ఆ తర్వాత కట్టెలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆయన చనిపోయాడని అనుకుని పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయారు.

తెల్లవారిన తర్వాత ఆ దారిలో వెళుతున్న బావాయిపల్లి గ్రామస్థులు ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న భాస్కర్ రెడ్డిని చూసి గుర్తించారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను 108 అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక అంబులెన్స్ లో ఆయనను హైదరాబాద్ కు తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande