ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరి.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంథనిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించిన సంగీత, నృత్య కళాశాల భవనం శిలాఫలకం వివాదానికి దారితీసింది.
Mp


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

మంథనిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించిన సంగీత, నృత్య కళాశాల భవనం శిలాఫలకం వివాదానికి దారితీసింది. ఆ ఫలకంపై ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు కనిపించకపోవడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తప్పుబట్టారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరని ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన వంశీకృష్ణ, నిబంధనల ప్రకారం శిలాఫలకంపై సీఎం రేవంత్ రెడ్డి పేరు, ఫొటోతో పాటు సంబంధిత మంత్రుల పేర్లు ఉండాలని సూచించారు. జరిగిన పొరపాటును వెంటనే సరిచేయాలని కోరారు.

ప్రజల సంక్షేమం కోసం చేపట్టే అభివృద్ధి పనులను ఎవరి వ్యక్తిగత ప్రచారానికో వాడుకోకూడదని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవులను గౌరవించడం, ప్రభుత్వ నియమాలను పాటించడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. వ్యక్తుల కంటే వ్యవస్థలే, స్వప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande