
తిరుచానూరు, 26 నవంబర్ (హి.స.)తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన, క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వాహన సేవల సమయంలో భక్తులకు అమ్మవారి దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, రవాణా, భద్రత వంటి సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆలయ మాడ వీధులు, పద్మ పుష్కరిణి, క్యూ మార్గాలతో పాటు భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, హోల్డింగ్ పాయింట్లను అధికారులు పరిశీలించారు. టీటీడీ, పోలీసు శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్