హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. పోలీస్ ఉన్నతాధికారులకు జైలు శిక్ష
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు శిక్షకు దారితీసింది.
హైకోర్టు


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు శిక్షకు దారితీసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

భూ వివాదానికి సంబంధించిన ఓ కేసులో పిటిషనర్కు రక్షణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారనే ఆరోపణపై విచారణ జరిగింది. ఆదేశాల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఇద్దరిపై శిక్షలు ఖరారు చేసింది.

అందులో భాగంగా సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డికి రెండు వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా పడింది. మేడ్చల్ డీసీపీ కోటిమరెడ్డికి కూడా జైలు శిక్ష, జరిమానా విధించారు.

అయితే ఈ శిక్షల అమలును హైకోర్టు వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ గడువులోగా పైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని, లేకపోతే హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం జైలు శిక్ష ఉంటుందని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande