భూ వివాదంలో న్యాయం జరగలేదంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
భూ వివాదంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ మహిళ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
భూ వివాదంలో న్యాయం జరగలేదంటూ మహిళ ఆత్మహత్యాయత్నం


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ మహిళ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్యాలయం ముందు ఫ్లోర్ క్లీనర్ తాగి తన ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తమ కుటుంబానికి సంబంధించిన భూ సమస్య విషయంలో అధికారుల నుంచి న్యాయం లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకుని ఫ్లోర్ క్లీనర్ తాగారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భూ వివాదం కారణంగానే మహిళ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భూ సమస్యల పరిష్కారంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande