డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: నాగార్జున
దేశంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు.
NAGARJUN


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)దేశంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నషా ముక్త్ భారత్ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని అమీర్పేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఫిల్మ్ నగర్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నటులు సాయికుమార్, శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున పాల్గొన్న వారికి డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.

డ్రగ్స్ రహిత భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సంకల్పం విజయవంతం కావాలని నాగార్జున ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనడం సంతోషకరమన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande