
అమరావతి , 27 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు పంచాయతీల్లో తిరిగి పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించింది. ఎన్నికల సమయంలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం వెల్లటూరు, గరికిపాడు గ్రామ పంచాయతీలతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలం నర్సంపల్లి పంచాయతీలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయా పంచాయతీల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి ఓటింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించనున్నారు. మూడు పంచాయతీల్లో రీపోలింగ్ నిర్వహణతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్