
అమరావతి , 27 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దాదాపు 30 ప్రతిపాదిత అంశాలను మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఈ భేటీలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేలా సుమారు రూ.88 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పది కంటే ఎక్కువ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ, రక్షణ, ఐటీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు.
మరోవైపు అమరావతి అభివృద్ధికి సంబంధించిన సీఆర్డీఏ ప్రతిపాదనలపైనా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజధాని పరిధిలోని 26 గ్రామాల్లో రహదారులు, పచ్చదనం అభివృద్ధి, అమరావతి సంగమం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అంశాలు అజెండాలో ఉన్నాయి. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైనా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాజకీయంగా కూడా చర్చ జరిగే అవకాశముంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్