
హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ సాధారణ సమయానికి ఐదు నెలలు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడితే, ఆ మధ్యకాలంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ అంశంపై స్పందించిన లక్ష్మణ్.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని తెలిపారు. దేశంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య, వాటి పరిధుల్లో మార్పులు చేయడం ఈ ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌కు సంబంధించిన పరిణామాలు భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో తదుపరి ఎన్నికల సమయంపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే పలు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచాయి. అయితే ఎన్నికల నిర్వహణ, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్