
అమరావతి , 27 నవంబర్ (హి.స.)
అసోంలోని భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కదిమి వేణు (31) విధి నిర్వహణలో ఉండగా నదిలో మునిగి మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం కలచివేసిందని అన్నారు.
జవాను వేణు మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశ సేవలో నిమగ్నమై ప్రాణాలు కోల్పోయిన ఆయనకు నివాళులర్పించారు. వేణు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. దేశ భద్రత కోసం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు, భద్రతా సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్